అమావాస్య అతిథులు
… views
ఒక చీకటి గదిలో ఒక వింటేజ్ ల్యాండ్‌లైన్ ఫోన్ రింగ్ అవుతూ ఉంది. శౌర్యకి నిద్ర డిస్టర్బ్ అయ్యి లైట్ ఆన్ చేశాడు. నిద్ర మత్తులోనే చుట్టూ చూశాడు. టీవీ దగ్గర డెకార్ కోసం పెట్టిన ఒక వింటేజ్ ఫోన్ వైర్ లేకుండా రింగ్ అవుతూ ఉంది. శౌర్యకి చెమటలు పట్టడం స్టార్ట్ అయ్యింది. రిసీవర్ మీద చెయ్యి పెట్టేసరికి చేతులు వణికాయి. వణుకుతున్న చేతులతోనే రిసీవర్ ఎత్తాడు. “హలో,” అన్నాడు.
"జాగ్రత్త. ఈ రోజు అమావాస్య అవ్వడం వల్ల మీ ప్రాంతంలో దెయ్యాలు తిరిగే అవకాశం ఉంది. భయభ్రాంతులకు గురి కాకుండా గుండె ధైర్యం చేసుకోండి," అని ఒక లేడీ వాయిస్ అంది.
ఇది నా భ్రమా? భ్రమ అయితే రిసీవర్ తీసేస్తే ఫోన్ రింగ్ అవ్వకూడదు అని రిసీవర్ తీసేసి పక్కన పెట్టేశాడు. ఫోన్ రింగ్ అవ్వలేదు. రిసీవర్ తీసి ఫోన్ మీద పెట్టాడు. ఫోన్ రింగ్ అయ్యింది. వెంటనే ఫోన్ ఎత్తాడు.
"ఆట మొదలు," అంది ఒక లేడీ వాయిస్. “ఎవరు నువ్వు?” అనేసరికి ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. ఫోన్ ఇంక రింగ్ అవ్వలేదు. శౌర్యకి భయం వేసి హెడ్సెట్ పెట్టుకొని పడుకున్నాడు. కాసేపటికి "నిను వీడని నీడను నేనే... కలగా మెదిలే కథ నేనే…" అని సాంగ్ ప్లే అయ్యింది. శౌర్యకి మత్తు వదిలిపోయింది. కళ్లు తెరిచేసరికి ఎదురుగా ఒక దెయ్యం తెల్ల చీరలో ఒక చేతిలో హెయిర్‌డ్రైయర్ పట్టుకొని జుట్టుకి పెట్టుకుంది. ఆ హెయిర్‌డ్రైయర్ స్పీడ్ పెంచింది.
"ఎహేయ్, ఇది ఎంత స్పీడ్ పెంచినా సినిమాల్లో దెయ్యాల్లా జుట్టు ఎగరట్లేదు ఏంటి," అని చిరాకు పడింది.
శౌర్యకి ఏమి అర్థం కాక "ఎవరు నువ్వు?" అని అడిగాడు.
"నా పేరు రోజి, 1984 లో హీరోయిన్ ఆడిషన్ లో నేను బాగా నటించినా కూడా ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఇద్దరం జుట్టూ, జుట్టూ పట్టుకొని కొట్టుకుంటుంటే నా తల గోడకి తగిలి చనిపోయాను."
"ఓహో," అన్నాడు శౌర్య.
"3 రోజులు రిహార్సల్ చేశా నిన్ను భయపెట్టడానికి. నువ్వేంటి నన్ను చూసి భయపడట్లేదు?" అని అడిగింది.
"కామెడీగా ఉన్నావ్," అన్నాడు శౌర్య.
"నీకు టేస్ట్ లేదు," అంది రోజి.
"నాకో డౌట్ ఉంది అడగనా?"
"అడుగు."
"నువ్వు 1984 లో చనిపోయిన దెయ్యానివి, ఇప్పుడేమో 2025. జుట్టు ఇంకా నల్లగా ఉంది. నువ్వేమో యంగ్‌గా ఉన్నావ్? ఎలా?"
"రంగు, మేకప్ వేసాను లేవోయ్,"
"అబ్బో!"
కర్టెన్ వెనక ఒకడు దాక్కొని ఉండటం శౌర్య చూశాడు.
"రేయ్, ఎవడ్రా నువ్వు? దొంగవా?" అని పక్కన ఉన్న దోమల బ్యాట్ ని వాడి మీదకు విసిరాడు.
వాడు వచ్చి "కాపాడు అన్నా," అని కాళ్ళ మీద పడ్డాడు.
"ఎవడ్రా నువ్వు? ఎవరి నుంచి కాపాడాలి నిన్ను?"
"నేను దెయ్యాన్ని. చంద్రముఖి సినిమా చూస్తున్నపుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయా. నాకు ఇప్పుడు కూడా ఆత్మలు అంటే భయం," అన్నాడు ధీరజ్.
"ఆత్మకే భయమా?" అని అడిగాడు శౌర్య.
"ప్రాణం పోయినా పోని అలవాటు బాబు! నేనేమీ కావాలని దెయ్యం అవ్వలేదు," అన్నాడు ధీరజ్ లుంగీ సరిచేసుకుంటూ.
"ఏమైనా సినిమా పెట్టొచ్చుగా, బోర్ కొడుతుంది," అంది రోజి.
"హర్రర్ సినిమా మాత్రం పెట్టకు," అన్నాడు ధీరజ్.
శౌర్య నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేసి సినిమా పెట్టాడు.
"హీరోయిన్ యావరేజ్‌గా ఉంది. పెద్ద అందగత్తె కూడా కాదు. దానికంటే నేనే బాగా చేసేదాన్ని," అంది రోజి.
ధీరజ్ నవ్వు ఆపుకున్నాడు.
శౌర్య ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది.
"ఇక్కడే ఉన్నావ్ కదా, ఫోన్ ఎందుకు?" అని అడిగాడు శౌర్య.
"నేను కాదు," అంది రోజి.
శౌర్య రిసీవర్ ని చేతిలోకి తీసుకొని "హలో, ఎవరు?" అన్నాడు.
"మేము పక్కింటి దెయ్యాలం. కొంచెం నెట్‌ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తారా?"
“యూజర్‌నేమ్ : అమావాస్య అతిథులు, పాస్వర్డ్ : మళ్ళీ రాకండి,” అని ఫోన్ ని కిచెన్ లో వాష్ బేసిన్ లో పడేసి ట్యాప్ ఆన్ చేశాడు.
THE END
© Ram Sai Nag 2026